కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద సింగరేణి మారుపేర్లు బాధితులు ఆమరణ నిరాహార దీక్ష
కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద సింగరేణి మారుపేర్లు బాధితులు ఆమరణ నిరాహార దీక్ష
కొత్తగూడెం, ఆగస్టు 14: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల ఆందోళన మరింత ఉధృతమైంది. సమస్యలను పరిష్కరించాలంటూ గత వారం రోజులుగా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసన దీక్ష కొనసాగిస్తున్న బాధితులు.. యాజమాన్యం, ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ దీక్ష ప్రారంభమైంది. బాధితులు దానాడ రాజు, ఓం ప్రకాష్, కొల్లిపాక అన్వేష్, గుర్రం సుధాకర్, దిశ్‌బాబు, రెక్కు శ్రావణ్, రేపాక కలావతి, భాగ్యలక్ష్మి తదితరులు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.
ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపులు
తమ కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరం వద్ద పోలీసుల బందోబస్తు
ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఐఐటీయూసీ నాయకులు సైతం బాధితులకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా లక్కా శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ.. “మా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఆమరణ నిరాహార దీక్షను విరమించం. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి” అని అన్నారు.
తమ న్యాయపోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు మద్దతు తెలిపి భాగస్వాములు కావాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment