ధాన్యం కేటాయింపుల అక్రమాలు.. మాజీ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం
ధాన్యం కేటాయింపుల అక్రమాలు.. మాజీ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం
మంచిర్యాల, ఆగస్టు 14: జిల్లాలో ధాన్యం తరలింపు, మిల్లుల ట్యాగింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో గతంలో మంచిర్యాల జిల్లాలో పనిచేసిన పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, మంచిర్యాల జిల్లాలో ఆయన హయాంలో జరిగిన ధాన్యం కేటాయింపులపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ నోటీసులు జారీ చేయగా, సరైన వివరణ ఇవ్వకపోవడంతో చర్యలకు సిఫారసు చేసినట్లు సమాచారం. తాజాగా విజిలెన్స్ విభాగం మెమో జారీ చేయడంతో వ్యవహారం మరింత కీలకంగా మారింది.
పొరుగు జిల్లాలకు ధాన్యం తరలింపుపై అభ్యంతరాలు
మంచిర్యాల జిల్లాలో రైస్‌మిల్లులు తక్కువగా ఉండటం, కొన్ని మిల్లులు సకాలంలో సీఎంఆర్ బియ్యం అందించకపోవడంతో బ్లాక్‌లిస్టు, డీఫాల్ట్ జాబితాలోకి వెళ్లడం, యాజమాన్యాలపై ఆర్‌ఆర్ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదవడం వంటి కారణాలతో ధాన్యం నిల్వలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి, కరీంనగర్ వంటి పొరుగు జిల్లాలకు ధాన్యం తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే ధాన్యం తరలింపులో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. రైస్‌మిల్లర్ల సంఘాల నాయకులతో ముందస్తు అవగాహన చేసుకుని, వారు సూచించిన మిల్లులకే ధాన్యం కేటాయించారనే ఆరోపణలు విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వడంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.39 కోట్ల విలువైన 17 వేల టన్నుల ధాన్యం
మూడేళ్ల క్రితం 2022-23 రబీ సీజన్‌లో మంచిర్యాల జిల్లా పౌరసరఫరాల శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో సుమారు 17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పొరుగు జిల్లాకు తరలించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. రెండు రైస్‌మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చి, కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ధాన్యాన్ని అప్పగించారు.
ఈ ధాన్యం విలువ సుమారు రూ.39 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మిల్లర్లు ఆ ధాన్యాన్ని విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. సీఎంఆర్ కింద తిరిగి బియ్యం అప్పగించాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరగడంతో మిల్లుల యాజమాన్యాలపై కేసులు కూడా నమోదయ్యాయి.
కమిషనర్ అనుమతి లేకుండానే తరలింపు?
నిబంధనల ప్రకారం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ధాన్యాన్ని తరలించాలంటే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనుమతి అవసరం. అయితే స్థానిక గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని పొరుగు జిల్లాలోని మిల్లులకు కేటాయించడంలో అవసరమైన అనుమతులు పాటించలేదనే అంశాన్ని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పెద్దపల్లి జిల్లాకు చెందిన రెండు మిల్లులకు ధాన్యం కేటాయించడంలోనే అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి నిర్ణయాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ విభాగం సిద్ధమవుతోంది.
మూడేళ్లుగా కొనసాగుతున్న ఆరోపణలు
మంచిర్యాల నుంచి గత మూడేళ్లుగా సన్న రకం వడ్లు, నాణ్యమైన ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిల్వలకు ఇబ్బందులు ఉన్నాయని చూపుతూ పొరుగు జిల్లాలకు పంపిన ధాన్యానికి సంబంధించి తిరిగి సీఎంఆర్ బియ్యం సమకూర్చాల్సి రావడంతో పాటు రవాణా కాంట్రాక్టర్ల బిల్లుల భారం కూడా ప్రభుత్వంపై పడుతోందని విమర్శలు ఉన్నాయి.
రవాణా కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపుల్లోనూ పర్సంటేజీల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వానాకాలంలో సన్న ధాన్యం కోసం పొరుగు జిల్లాల మిల్లర్లు పోటీ పడిన సమయంలో టన్నుకు కొంత మొత్తాన్ని లెక్కకట్టి కొందరు అనధికారికంగా లబ్ధి పొందారనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి.
ఇకనైనా అక్రమాలకు అడ్డుకట్ట?
గతంలో పనిచేసిన అధికారి వ్యవహారంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ధాన్యం కేటాయింపులు, మిల్లుల ట్యాగింగ్ విషయంలో అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ధాన్యం తరలింపునకు అనుమతులు, మిల్లుల ఎంపిక, ట్యాగింగ్, సీఎంఆర్ బియ్యం అప్పగింత, రవాణా బిల్లులు తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం
విచారణలో ఆరోపణలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంచిర్యాల జిల్లా ధాన్యం కేటాయింపుల వ్యవహారం పౌరసరఫరాల శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Post a Comment