అపార్థాలు, మనస్పర్థలు, అహంకారంలతో అందర్ని దూరం చేసుకుంటే మనమే లోకం నుండి దూరం అయిపోతాము
జీవితం అనేది మనుషుల మధ్య సంబంధాలు, అనుబంధాలు, ప్రేమ, నమ్మకం, సహకారంతో ముందుకు సాగుతుంది. అయితే చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్థలు, అహంకారం, ఆర్థిక సమస్యలు, ఆశలు, కోపం వంటి కారణాలతో మనకు అత్యంత సన్నిహితమైన వారినే దూరం చేసుకుంటూ పోతుంటాం. ఒకరిని ఒక కారణంతో, మరొకరిని ఇంకో కారణంతో జీవితంలో నుంచి తొలగించుకుంటూ వెళ్తే.. చివరికి మన చుట్టూ మనుషులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి రావచ్చు.
‘సహకరించట్లేదు’ అని భార్యను వదిలేస్తాం.. ‘అర్థం చేసుకోవట్లేదు’ అని భర్తను దూరం చేసుకుంటాం. ‘అండగా నిలవలేదు’ అని తమ్ముడిని వదిలేస్తాం.. ‘అహంకారం చూపుతున్నాడు’ అని అన్నతో సంబంధాలు తెంచుకుంటాం.
ఆస్తి విషయంలో మనస్పర్థలు రావడంతో తల్లిదండ్రులను దూరం చేసుకుంటాం. అవసరమైన సమయంలో అక్కాచెల్లెళ్లు ఆదుకోలేదని వారితో మాట్లాడటం మానేస్తాం. స్నేహితులు మన అవసరానికి ఉపయోగించుకున్నారని బాధపడి వారిని కూడా జీవితంలో నుంచి తొలగించుకుంటాం.
ఇలా ఒక్కొక్కరినీ ఒక్కో కారణంతో వదులుకుంటూ పోతే.. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకునే సమయానికి మన చుట్టూ ఎవరూ లేకపోవచ్చు.
నిజానికి ఏ మనిషీ పరిపూర్ణుడు కాదు. ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడు లక్షణాలు ఉంటాయి. మనతో కలిసి జీవించే వారిలో తప్పులు కనిపించడం సహజం. కానీ ప్రతి తప్పుకూ సంబంధాన్ని తెంచుకోవడం పరిష్కారం కాదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, క్షమించడం, అవసరమైన చోట కొంత సర్దుకుపోవడం ఎంతో ముఖ్యం.
మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరో ఒకరు అండగా నిలవలేదని జీవితాంతం వారిని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. అలాగే మనం కూడా ప్రతి సందర్భంలో అందరి అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరించలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జీవితం చాలా చిన్నది. ఈరోజు మనతో ఉన్న మనిషి రేపు మనతో ఉంటాడనే హామీ లేదు. అలాగే మనం కూడా ఎప్పటికీ ఈ లోకంలో ఉండం. ఒకరోజు మనమూ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లాల్సిందే. అప్పుడు మనం సంపాదించిన ఆస్తులు, డబ్బు, హోదా కంటే మనతో ఉన్న అనుబంధాలు, మనుషుల ప్రేమ, మనం పంచిన మంచితనమే గుర్తుండిపోతాయి.
అందుకే ప్రతి చిన్న విషయానికీ సంబంధాలను తెంచుకోవడం కంటే.. సాధ్యమైన చోట మాట్లాడుకుందాం.. తప్పులను క్షమిద్దాం.. మనుషులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.. అవసరమైనప్పుడు ఒకరికి ఒకరం అండగా నిలుద్దాం.
ఎందుకంటే చివరికి మనం కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిందే. వెళ్లే ముందు మన చుట్టూ ఒక్క మనిషి కూడా మిగలకుండా సంబంధాలను తెంచుకోవడం కంటే.. మనతో పాటు ప్రేమను, ఆప్యాయతను, మంచి జ్ఞాపకాలను మిగిల్చుకోవడం ఎంతో గొప్ప విషయం.

Post a Comment