నాసిక్‌లో నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు
నాసిక్‌లో నకిలీ కరెన్సీ ముద్రణ ముఠా గుట్టురట్టు
మహారాష్ట్రలోని నాసిక్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాసిక్–త్ర్యంబకేశ్వర్ రోడ్డులోని తాలేగావ్ గ్రామంలో ఓ బంగ్లాలో నకిలీ నోట్ల ముద్రణ కేంద్రం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు అసలు కరెన్సీ నోట్లను ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, వాటిలోని ఇంక్‌ను కాగితంపైకి బదిలీ చేసే విధానంలో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని అసలు నోట్ల మాదిరిగా తయారు చేసి మార్కెట్‌లో చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.10 లక్షల విలువైన అసలు కరెన్సీకి బదులుగా రూ.30 లక్షల నకిలీ నోట్లను అందించే సమయంలో పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ నోట్లు, నోట్ల తయారీకి ఉపయోగించే కాగితాలు, ప్రింటింగ్ పరికరాలు, ప్రత్యేక రసాయనాలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు? ఈ ముఠాతో ఇంకా ఎవరెవరు సంబంధాలు కలిగి ఉన్నారు? నకిలీ నోట్లను ఎక్కడెక్కడ చలామణి చేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment