నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు
నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి, ఆగస్టు 3: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ భవనాల పనులను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment