-->

అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి కలప అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్

 

అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి కలప అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్

అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి కలప అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్

ఖమ్మం, ఆగస్టు 16: ఫారెస్ట్ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాలను ట్యాంపరింగ్ చేసి, నకిలీ పర్మిట్లతో కలపను అక్రమంగా రవాణా చేసిన ఇద్దరు నిందితులను ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ తెలిపారు.

గత ఏడాది డిసెంబర్‌లో ఖమ్మం ఫారెస్ట్ రేంజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఏసీపీ మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.

పర్మిట్లలో పేర్లు మార్చి అక్రమ రవాణా

కేసు వివరాల ప్రకారం.. నల్లతుమ్మ కర్ర సరఫరా కోసం ఖమ్మం ఫారెస్ట్ కార్యాలయం నుంచి ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై జారీ చేసిన అనుమతి పత్రాలను నిందితులు ట్యాంపరింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందులోని కలప రకాన్ని మార్చి ‘సండ్ర కర్ర’గా చూపిస్తూ నకిలీ పర్మిట్లను తయారు చేసినట్లు తెలిపారు.

ఆ పర్మిట్ల ఆధారంగా అయ్యగారుపల్లి, కురవి, సీరోలు, కంపెళ్లి, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో సండ్ర చెట్లను నరికించి, వాటిని విజయవాడకు చెందిన రాధే శ్యామ్‌కు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో సూర్యాపేట జిల్లా మోతే మండలం గోప్యతండాకు చెందిన కలప వ్యాపారి కొర్ర శివతో పాటు విజయవాడకు చెందిన రాధే శ్యామ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఇతర జిల్లాల్లోనూ కేసులు

నిందితుడు కొర్ర శివపై వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా ఫారెస్ట్ కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైందని ఏసీపీ మహ్మద్ సర్వర్ తెలిపారు.

రాధే శ్యామ్ ఈ కలపను మధ్యప్రదేశ్‌లోని జాబువా పట్టణంలో ఉన్న ఏఎం ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అబ్దుల్ రహేమాన్‌కు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లో ఈ రకమైన కలపను పాన్‌మసాలా తయారీలో ఉపయోగించే కత్తా తయారీకి వినియోగిస్తారని తెలిపారు.

ఇప్పటివరకు సుమారు 9 లారీల కలపను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

దర్యాప్తు కొనసాగుతోంది

ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీపీ తెలిపారు. అక్రమ కలప రవాణా వ్యవహారంలో మరెవరెవరి ప్రమేయం ఉందో గుర్తించి, వారి పాత్ర ఆధారంగా తదుపరి అరెస్టులు చేపడతామని వెల్లడించారు.

కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఏసీపీ మహ్మద్ సర్వర్, ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్, ఎస్సై ఎ. వంశీకృష్ణ, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హరి, జానీ, నరసింహారావు, సుధీర్, సతీష్, సుందర్, శ్రీధర్‌లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793