10 కోట్ల అప్పుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరార్ బాధితుల ఫిర్యాదు
రూ.10 కోట్ల అప్పుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరార్.. బాధితుల ఫిర్యాదు
చివ్వెంల, సెప్టెంబర్ 26: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు భారీగా అప్పులు చేసి కుటుంబంతో కలిసి కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపుతోంది. సుమారు రూ.10 కోట్ల మేర అప్పులు తీసుకుని ఉడాయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనాయక్ తండాకు చెందిన బానోత్ రాజు శెట్టిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన అదే మండలంలోని హున్యా తండాకు చెందిన బాణోతు నాగేందర్‌తోపాటు పలువురి వద్ద భారీగా డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు.
తాను ప్రభుత్వ ఉద్యోగినని, బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేశానని, లోన్ మంజూరైన వెంటనే అప్పులు తిరిగి చెల్లిస్తానని రాజు చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ నమ్మకంతో పలువురు ఆయనకు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు.
అయితే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు రాజుతోపాటు ఆయన భార్య బెదిరింపులకు పాల్పడేవారని బాధితులు ఆరోపించారు. తన పేరిట ఉన్న ఆస్తులను బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశానని, ఇప్పుడు తనను ఏమీ చేయలేరని చెప్పినట్లు వారు తెలిపారు.
వారం రోజులుగా కనిపించని దంపతులు
గత వారం రోజులుగా రాజు, ఆయన భార్య గ్రామంలో కనిపించడం లేదని బాధితులు చెబుతున్నారు. ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో రాజు, ఆయన భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ సూర్యాపేట ఎస్పీ నరసింహకు, చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చివ్వెంల ఎస్సై మహేశ్వర్ తెలిపారు. రూ.కోటి చొప్పున అప్పుగా ఇచ్చిన కొందరు బాధితులు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
కాగా, ఉపాధ్యాయుడు రాజు సుమారు రూ.10 కోట్లతో పరారైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మొత్తం అప్పుల మొత్తం, ఆర్థిక లావాదేవీలు, ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Post a Comment