సింగరేణి అడ్రియాల ప్రాజెక్టులో పేలిన ఎయిర్ ట్యాంక్ 5 గురికి గాయాలు
సింగరేణి అడ్రియాల ప్రాజెక్టులో పేలిన ఎయిర్ ట్యాంక్ 5 గురికి గాయాలు
ఐదుగురు కార్మికులకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
రామగుండం, సెప్టెంబర్ 4: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ (ఏఎల్‌పీ) మైన్ ప్రాజెక్టులో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోని ఎస్‌బీఎల్ ఎయిర్ ట్యాంక్ కంప్రెషర్‌లో ఎయిర్ నింపుతుండగా ట్యాంక్ లీకేజీకి గురై భారీ శబ్దంతో పేలింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. ఎయిర్ ట్యాంక్‌లో కార్మికులు ఎయిర్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా లీకేజీ ఏర్పడింది. అనంతరం భారీ శబ్దంతో ట్యాంక్ బ్లాస్ట్ కావడంతో అందులోని ఆయిల్ బయటకు వచ్చి సమీపంలో ఉన్న కార్మికులపై పడింది. ఈ ఘటనలో ఫిట్టర్ పి. కిరణ్‌కుమార్, ఎస్‌డీఎల్ ఆపరేటర్ వి. శ్రీనివాస్, జనరల్ అసిస్టెంట్లు సీహెచ్. ప్రశాంత్, టి. మనోజ్‌కుమార్, ఆర్. లక్ష్మణ్ స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే తోటి కార్మికులు గాయపడిన వారిని సెంటినరీ కాలనీలోని సింగరేణి డిస్పెన్సరీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో గాయపడిన కార్మికులకు వినికిడి సంబంధిత సమస్యలు తలెత్తాయా అనే అంశంపై వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎయిర్ ట్యాంక్ లీకేజీకి దారితీసిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల అమలు తదితర అంశాలపై విచారణ జరిపే అవకాశం ఉంది.

Post a Comment