-->

ఢిల్లీలో భారీ బిల్డింగ్ కుప్పకూలిన ఘటన.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు?

 

ఢిల్లీలో భారీ బిల్డింగ్ కుప్పకూలిన ఘటన.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు?

ఢిల్లీలో భారీ బిల్డింగ్ కుప్పకూలిన ఘటన.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సత్యనికేతన్ ప్రాంతంలో శివ మందిరం సమీపంలోని ఓ పాత బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనంలో పీజీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులతో పాటు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, ఎంసీడీ, డీడీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని మరో భవనాన్ని కూడా అధికారులు ఖాళీ చేయించారు.

లోపల 50 మంది విద్యార్థులు?

ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వచ్చిన పలువురు విద్యార్థులు ఈ భవనంలోని పీజీలో ఉంటున్నారని తెలిపారు. శిథిలాల లోపలి నుంచి కొందరు విద్యార్థులు ఫోన్ ద్వారా తమను రక్షించాలని కోరుతున్నట్లు వెల్లడించారు. సుమారు 50 మంది విద్యార్థులు లోపల ఉండి ఉండొచ్చనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సంఖ్యపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

బేస్‌మెంట్ పనులే కారణమా?

పాత భవనంలో నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్ నిర్మాణం, ఆధునీకరణ పనులు చేపట్టడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బేస్‌మెంట్ కోసం కింద భాగంలో తవ్వకాలు చేపట్టడంతో భవనం పిల్లర్లు బలహీనపడి ఒక్కసారిగా కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

భవనం కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షణాల్లోనే భవనం నేలమట్టం కావడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, పొగతో నిండిపోయిందని చెప్పారు.

సీఎం రేఖా గుప్తా స్పందన

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం, బాధితులకు తక్షణ సహాయం అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారనే దానిపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

Blogger ఆధారితం.