వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసింది, సీజనల్ వ్యాధులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి
వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసింది, సీజనల్ వ్యాధులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో మౌలిక వసతులు ఎక్కడ? మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ధ్వజం
కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ నాయకురాలు కాపు సీతాలక్ష్మి విమర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
ఆదివారం 15వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్త, తాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యలపై ప్రజలు తమ ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్నా వార్డుల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదని విమర్శించారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో ప్రజలు దుర్వాసన, దోమల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. స్వచ్ఛ ట్రాలీలను ఏర్పాటు చేసి చెత్త సేకరణకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి ఇంటికీ డస్ట్‌బిన్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ వ్యవస్థను సక్రమంగా వినియోగించకపోవడంతో ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తోందని మండిపడ్డారు.
వర్షాకాలంలో దోమల వృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, బ్లీచింగ్ పౌడర్, యాంటీ లార్వా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు పనిచేయని వీధి దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే వాటి అమలులో ప్రజలకు నిరాశే మిగిలిందని కాపు సీతాలక్ష్మి విమర్శించారు. మహిళలను నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ.. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెన్షన్ల పెంపు విషయంలోనూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేశామని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సూచించారు.
వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిమాండ్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment