పట్టాలు తప్పిన మహానంద ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
పట్టాలు తప్పిన మహానంద ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
బిహార్: ఢిల్లీ వైపు వెళ్తున్న మహానంద ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రైలు ఇంజిన్‌తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం.
15483 నంబర్ గల అలీపుర్దువార్ జంక్షన్–ఢిల్లీ సిక్కిం మహానంద ఎక్స్‌ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున 4.12 గంటలకు బిహార్‌లోని ఆరా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 2కు చేరుకుంది. అనంతరం ఢిల్లీ వైపు బయలుదేరే సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఏర్పడింది.
ససారం అప్‌లైన్ వైపు సిగ్నల్ చూపించడంతో రైలు ముందుకు కదిలింది. అయితే స్టేషన్‌కు సుమారు 200 మీటర్ల దూరంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇంజిన్‌తో పాటు రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లను నియంత్రిస్తూ రైల్వే అధికారులు పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు.

Post a Comment