బావిలో పడి రైతు మృతి.. చామన్‌పల్లిలో విషాదం
కరీంనగర్: వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.
చామన్‌పల్లి గ్రామానికి చెందిన బొజ్జ లచ్చయ్య (55) వ్యవసాయ రైతు. సెప్టెంబర్ 5న తన వ్యవసాయ భూమిలోని బావి వద్ద పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడి బావిలో పడిపోయాడు. ఈ క్రమంలో బావిలోని రాళ్లపై పడటంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అనంతరం నీటిలో మునిగిపోయాడు.
లచ్చయ్య సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతని కోసం వెతికారు. బావి సమీపంలో లచ్చయ్యకు సంబంధించిన వస్తువులు, ఫోన్ కనిపించడంతో బావిలో పడి ఉండొచ్చని అనుమానించారు. బావిలో పరిశీలించగా నీటిలో లచ్చయ్య కనిపించాడు. వెంటనే అతడిని బయటకు తీసి చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే లచ్చయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బొజ్జ రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment