రెండు నిమిషాల ప్రయాణం.. అంతలోనే ఘోర ప్రమాదం
రెండు నిమిషాల ప్రయాణం.. అంతలోనే ఘోర ప్రమాదం
పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
తిరుమలాయపాలెం: గణేష్ నిమజ్జనం బందోబస్తు విధులు ముగించుకుని పోలీస్ స్టేషన్‌కు తిరిగి వెళ్తున్న ఎస్సై ప్రయాణిస్తున్న పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌తో పాటు వాహన డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం వినాయక నిమజ్జనం సందర్భంగా పిండిప్రోలు గ్రామంలో బందోబస్తు విధులు నిర్వహించిన ఎస్సై జగదీష్.. విధులు ముగించుకుని పోలీస్ వాహనంలో తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. స్టేషన్‌కు సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న భవాని హోటల్ సమీపానికి చేరుకోగానే ఖమ్మం నుంచి మరిపెడ బంగ్లా వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది.
లారీ ఢీకొనడంతో పోలీస్ వాహనం తీవ్రంగా ధ్వంసమై రోడ్డు పక్కన ఉన్న పత్తి చేనులోకి దూసుకెళ్లి పడిపోయింది. ప్రమాదంలో ఎస్సై జగదీష్ మెడ భాగంలోని నరాలకు గాయాలైనట్లు సమాచారం. వాహన డ్రైవర్ రాకేష్ కుడికాలు విరిగిపోవడంతో పాటు తలకు బలమైన గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సిటీ స్కాన్ నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఎస్సై జగదీష్, డ్రైవర్ రాకేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
పోలీస్ వాహనం స్టేషన్‌కు చేరుకోవడానికి కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉండగా ఈ ప్రమాదం జరగడం విషాదకరంగా మారింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Post a Comment