-->

డోర్ లాక్ పడి కారులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి

 

జూలూరుపాడులో విషాదం.. సర్పంచ్ కుమార్తె దుర్మరణం

డోర్ లాక్ పడి కారులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి

జూలూరుపాడులో విషాదం.. సర్పంచ్ కుమార్తె దుర్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటూ పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కిన నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు డోర్ లాక్ కావడంతో బయటకు రాలేక మృతి చెందింది. ఈ ఘటనతో వినోబానగర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వినోబానగర్ గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్, ఐశ్వర్య దంపతుల పెద్ద కుమార్తె తన్వితశ్రీ (4) ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి అక్కడే పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కింది. చిన్నారి కారులోకి వెళ్లిన అనంతరం ప్రమాదవశాత్తు డోర్లు లాక్ కావడంతో బయటకు రాలేకపోయింది. కొంతసేపటి తర్వాత ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ సమయంలో తండ్రి నవీన్ సర్పంచులతో కలిసి వైరా ఎమ్మెల్యేను కలిసేందుకు కొత్తగూడెం వెళ్లారు. తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చిన్నారి చాలాసేపు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాలతో పాటు గ్రామంలో వెతికారు. చివరకు పార్క్ చేసి ఉన్న కారులో చిన్నారి పడి ఉండటాన్ని గుర్తించారు.

వెంటనే చిన్నారిని జూలూరుపాడులోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ విషాద ఘటనతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్థానిక నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.

Blogger ఆధారితం.