-->

అనుమానం పెనుభూతం.. భార్యను కత్తితో పొడిచి హత్య

 

కూతురిపై దాడిని అడ్డుకున్న అత్తకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో పరిస్థితి విషమం

అనుమానం పెనుభూతం.. భార్యను కత్తితో పొడిచి హత్య

కూతురిపై దాడిని అడ్డుకున్న అత్తకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో పరిస్థితి విషమం

ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల), సెప్టెంబర్ 3: అనుమానం పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. కూతురిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తపైనా కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర వడ్డెర కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ ఓదెల వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పదిర వడ్డెర కాలనీకి చెందిన గండికోట చంద్రయ్య-ఎల్లవ్వ దంపతుల కుమార్తె జ్యోతి (28)కి ముస్తాబాద్‌ మండలం చీకోడుకు చెందిన పల్లపు సురేష్‌తో సుమారు పదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం వీరి సంసారం సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సుమారు ఎనిమిది నెలల క్రితం జ్యోతిని హత్య చేసేందుకు సురేష్‌ రెండుసార్లు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించగా, జ్యోతి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జ్యోతిని పుట్టింటికి తీసుకొచ్చారు. జ్యోతి ఫిర్యాదు మేరకు ముస్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో సురేష్‌పై కేసు నమోదైంది. అప్పటి నుంచి జ్యోతి ఎనిమిది నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది.

గ్రామ సమీపంలోని అర్బన్‌ పార్కులో జ్యోతి దినసరి కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో జ్యోతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో సురేష్‌ ఆమెను, ఆమె బంధువులను పలుమార్లు దూషించినట్లు సమాచారం.

బస్టాండ్‌లో కాపుకాసి.. వెంబడించి దాడి

జ్యోతిపై దాడి చేసేందుకు సురేష్‌ మరో ముగ్గురితో కలిసి కారులో పదిర బస్టాండ్‌కు వచ్చి మధ్యాహ్నం నుంచే కాపుకాశాడు. ఇదే సమయంలో జ్యోతి తన తల్లి ఎల్లవ్వతో కలిసి కరీంనగర్‌ ఆస్పత్రికి వెళ్లి తిరిగి వచ్చింది. రాత్రి చీకటి పడే సమయంలో తల్లీకూతుళ్లు బస్సు దిగి వడ్డెర కాలనీ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా సురేష్‌ వారిని వెంబడించాడు.

అనంతరం జ్యోతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కూతురిని రక్షించేందుకు ఎల్లవ్వ అడ్డుకోబోగా ఆమెపైనా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన జ్యోతి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం నిందితుడు కత్తిని అక్కడే వదిలేసి తన వెంట వచ్చిన కారులో పరారయ్యాడు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు సురేష్‌ సిరిసిల్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడితో పాటు ఘటనకు సంబంధం ఉన్న ఇతరుల పాత్రపైనా విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా, తీవ్రంగా గాయపడిన ఎల్లవ్వను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జ్యోతి మృతితో ఆమె ఇద్దరు కుమారులు, కుమార్తె తల్లిని కోల్పోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనుమానం కారణంగా భార్యను హత్య చేయడం, అడ్డుకున్న అత్తపైనా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Blogger ఆధారితం.