-->

ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క

 

ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క

ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అక్టోబర్ 2న గ్రామసభలు నిర్వహించనున్న నేపథ్యంలో.. గ్రామాల్లో ఈ ఏడాది చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షించారు. గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ప్రతి గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతులు, పచ్చదనం, ప్రజలకు అవసరమైన ఇతర సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలిపారు.

వాతావరణ పరిస్థితులపై కూడా మంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం, దాని తీవ్రత గురించి అందరికీ అవగాహన ఉందని పేర్కొంటూ.. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్‌తో పాటు పంచాయతీరాజ్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామసభల నిర్వహణ, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు.

Blogger ఆధారితం.