-->

సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి.. ఖమ్మంలో విషాదం

 

సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి.. ఖమ్మంలో విషాదం

సంపులో పడి నాలుగేళ్ల బాలుడి మృతి.. ఖమ్మంలో విషాదం

ఖమ్మం: నగరంలోని ప్రకాశ్‌నగర్ కుమ్మరి బజార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇంటి పక్కనే ఉన్న సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. కుమ్మరి బజార్‌కు చెందిన సురేశ్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆయన నిర్మిస్తున్న ఇంటి పక్కనే సోమారపు ఉమారాణి, సాయి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా.. వారి కుమారుడు గగన్ ఉదయ్ (4) ఆడుకుంటూ నిర్మాణంలో ఉన్న ఇంటివైపు వెళ్లాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి అక్కడ ఉన్న సంపులో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. చివరకు నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఉన్న సంపులో బాలుడు కనిపించాడు.

వెంటనే బాలుడిని సంపులో నుంచి బయటకు తీసి చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సంపుపై తప్పనిసరిగా మూత ఏర్పాటు చేయాలని గతంలో సూచించినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Blogger ఆధారితం.