కారు టెయిల్ లైట్ వెనుక రహస్య చాంబర్.. రూ.3.83 కోట్ల బంగారం పట్టివేత!

 

కారు టెయిల్ లైట్ వెనుక రహస్య చాంబర్.. రూ.3.83 కోట్ల బంగారం పట్టివేత!

కారు టెయిల్ లైట్ వెనుక రహస్య చాంబర్.. రూ.3.83 కోట్ల బంగారం పట్టివేత!

హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠా కొత్త ఎత్తుగడను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఛేదించారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.83 కోట్ల విలువైన 2.98 కిలోల బంగారాన్ని డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

టెయిల్ లైట్ వెనుక ప్రత్యేక రహస్య అర

పక్కా సమాచారంతో అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు కోల్‌కతా-హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ఓ ఎస్‌యూవీ కారును అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు వెనుక భాగంలోని టెయిల్ లైట్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య చాంబర్‌ను గుర్తించారు.

25 బంగారు కడ్డీలు స్వాధీనం

రహస్య చాంబర్‌ను తెరిచి చూడగా బ్రౌన్ కలర్ అడెసివ్ టేప్‌తో చుట్టిన మూడు ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా మొత్తం 2.98 కిలోల బరువున్న 25 బంగారు కడ్డీలు లభించాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన వాల్యూయర్ పరిశీలనలో అవి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా నిర్ధారణ అయ్యాయి. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.3.83 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

కారుతో పాటు బంగారం సీజ్

కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం అక్రమంగా తరలిస్తున్న బంగారంతో పాటు స్మగ్లింగ్‌కు ఉపయోగించిన ఎస్‌యూవీ వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

టెయిల్ లైట్ వెనుక రహస్య చాంబర్ ఏర్పాటు చేసి కోట్ల విలువైన బంగారాన్ని తరలించే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది.


Blogger ఆధారితం.