సిద్దిపేటలో నాపై పోటీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ సవాల్
సిద్దిపేటలో నాపై పోటీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ సవాల్
సిద్దిపేట సభలో సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఘాటు స్పందన.. కొడంగల్లో కాదు, దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చేయాలని ఛాలెంజ్
హైదరాబాద్ (తెలంగాణ సమయం పొలిటికల్ బ్యూరో): సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే కొడంగల్లో కాకుండా సిద్దిపేటలో తనపై పోటీ చేసి గెలవాలని బహిరంగ సవాల్ విసిరారు.
శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. సిద్దిపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ నేతల పేర్లనే పదేపదే ప్రస్తావించారని విమర్శించారు.
సీఎం తన ప్రసంగంలో 63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు తన పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు ప్రస్తావించారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ లెక్కలే సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఏ అంశాల చుట్టూ సాగిందో చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తుండటంతో వారి దృష్టిని మళ్లించేందుకే సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
"కొడంగల్లో కాదు.. దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చేయండి" అంటూ రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. సీఎం వ్యాఖ్యలకు రాజకీయంగా దీటైన సమాధానం ఇచ్చారు.

Post a Comment