డ్యూటీ కి రాకున్నా జీతం*
*డ్యూటీ కి రాకున్నా జీతం*
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయంలో లైబ్రేరియన్గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి విధులకు రాకుండానే ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించి జీతం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం గ్రంథాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి 2018 సంవత్సరంలో వికలాంగుల, వయోవృద్ధుల శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల
బ్యాక్ లాగ్ కోట కింద గ్రేడ్ త్రి లైబ్రేరియన్ గా ఉద్యోగం పొందాడు. ఉద్యోగం పొందే నాటికే అతడు ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత సంబంధిత శాఖ అధికారులను సంప్రదించి పెన్షన్ రద్దు చేయాలని దరఖాస్తు చేయాలి. ఇదేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న కొనిజర్ల గ్రంథాలయ శాఖ ఉద్యోగి 2018 నుంచి ఇప్పటివరకు వికలాంగుల పింఛను తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు.
*అంతా ఆయన ఇష్టం....*
తాను ఉద్యోగానికి రాను... అంతా నా ఇష్టం అంటూ ఓ జిల్లా స్థాయి అధికారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. మండల గ్రంథాలయంలో పనిచేసే ఉద్యోగులు స్థానికంగా నివాసం ఉంటూ, ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు గ్రంథాలయం తెరిసే ఉంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష విజయవంతంగా నిర్వహించి 'కీ' కూడా విడుదల చేసింది.
మరోవైపు డీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఆగస్టులో నిర్వహించే గ్రూప్ టు పరీక్షకు కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో గ్రంథాలయంలో అందుబాటులో ఉండి బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన ఉద్యోగి అందుబాటులో లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
*చట్టాలు నాకు వర్తించవు*
కొనిజర్ల మండల కేంద్రంలో పనిచేస్తున్న గ్రంథాలయ ఉద్యోగిపై అనేక ఆరోపణ వినిపిస్తున్నాయి. 2018లో ఉద్యోగం పొందే క్రమంలో వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కీలక ఉద్యోగిని సంప్రదించి, వికలాంగుల రోస్టర్ పాయింట్ ని మార్పించి ఉద్యోగం పొందాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నత అధికారులు స్పందించి గ్రంథాలయ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment