డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వైన్ షాపులు?
హైదరాబాద్: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రణాళికలు ఇప్పటికే పూర్తయ్యాయి.
ప్రతి సంవత్సరం చివరి రోజున ప్రజలు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మందుబాబులకు ఇది మరింత ప్రత్యేకం. ఏదైనా జరిగితే గాని, ఆ రోజు మాత్రం గొంతులో మద్యం పడాల్సిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. డిసెంబర్ 31న రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరచుకోవచ్చని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం మందుబాబులను ఆనందంలో ముంచెత్తింది.
అయితే కొత్త సంవత్సరం సందర్భంగా జరిగే ఈవెంట్లు రాత్రి 1 గంటకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు స్పష్టం చేసింది. ఎవరు డ్రగ్స్ విక్రయించినా, కొనుగోలు చేసినా, దగ్గర ఉంచుకున్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అలాగే, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే ఈవెంట్లు, పార్టీలపై పోలీసులు ప్రత్యేక నిఘా వేసేలా ఆదేశాలు జారీ చేసింది. మందు తాగినా, వేడుక చేసుకున్నా—చట్టం ఉల్లంఘించకుండా జాగ్రత్తపడండి!

Post a Comment