ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురి ఆత్మహత్య: కారణాలపై దర్యాప్తు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సంచలనం సృష్టించిన ముగ్గురు ఆత్మహత్య ఘటనకు సంబంధించి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. బిక్కనూర్ ఎస్సై హెచ్ బి సాయి కుమార్ (31), బిబి పేట్ కానిస్టేబుల్ శ్రుతి (32), బిబి పేట్ పోలీస్ స్టేషన్‌లో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (28) ముగ్గురూ బుధవారం పెద్ద చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నారు.
గత రాత్రి తీవ్ర గాలింపు చర్యలు:
బుధవారం రాత్రి నుంచి పెద్ద చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, గురువారం ఉదయం ఎస్సై సాయి కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇదే సమయంలో, బుధవారం రాత్రి 9 గంటలకే శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
సంఘటనకు ముందు వివరాలు:
బుధవారం మధ్యాహ్నం నుండి ముగ్గురి ఫోన్‌లు స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు అనుమానం పడి టవర్ లొకేషన్ ఆధారంగా చెరువుకి చేరుకున్నారు. అక్కడ, ఎస్సై కారుతో పాటు శ్రుతి, నిఖిల్‌లకు సంబంధించిన సెల్‌ఫోన్లు, చెప్పులు మరియు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి.
ఆత్మహత్య వెనుక కారణాలపై ఆరా:
ఈ ముగ్గురు కలుసుకోవడం, వారి మధ్య ఏదైనా గొడవ జరగిందా, లేక ఆత్మహత్య వెనుక ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ శ్రుతి వ్యక్తిగత జీవితం పట్ల కూడా విచారణ సాగిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం అయినప్పటికీ, వ్యక్తిగత కారణాలవల్ల ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిసింది.
పోలీసు శాఖలో కలకలం:
ఈ ఘటన పోలీసులు మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. ముగ్గురి మరణం వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. ఎల్లారెడ్డి పోలీసులు పూర్తిగా దర్యాప్తు జరుపుతుండగా, ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Post a Comment