వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు
పాపకొల్లు గ్రామంలో వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ, బెజవాడ బెబ్బులి, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ నాయకులు రంగా సేవలను గుర్తు చేస్తూ ఆయన ప్రజల కోసం చేసిన త్యాగాలను కొనియాడారు.
నాయకులు మాట్లాడుతూ, "రంగ ఏ కులానికో చెందిన వ్యక్తి కాదు. ఆయనే అన్ని కులాల ఆరాధ్య దైవం. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన, పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సమయంలో అమానుషంగా హత్యకు గురయ్యారు. కానీ, ఆయన సేవలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి," అని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల పైగా విగ్రహాలు ఉండటం ఒకే ఒక్క రంగా కి సాధ్యమైందని, ఆయన ఆశయాలు ఎప్పటికీ తమ గుండెల్లో పదిలంగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జూలూరుపాడు మండల అధ్యక్షుడు రామిశెట్టి రాంబాబు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా ఆశయాలను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాలకు కట్టుబడి పనిచేయాలని మున్నూరు కాపు కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది.
Post a Comment