ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
హైదరాబాద్: చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) విజృంభణ ప్రపంచ దేశాలను మళ్లీ భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ వల్ల గతంలో జరిగిన విషాదాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన ప్రజలు, ఈ కొత్త వైరస్ తీవ్రతపై ఆందోళన చెందుతున్నారు. చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు అలర్ట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫ్లూ లక్షణాలున్న వారు మాస్కులు ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో ఇప్పటివరకు హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారు భౌతిక దూరం పాటించాలని హెచ్చరించింది.
చేయాల్సినవి:
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటిని, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేయండి. జ్వరం, దగ్గు, తుమ్ములతో బాధపడుతుంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దు. సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి. ఫ్లూ లక్షణాలున్న వారితో భౌతిక దూరం పాటించండి. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి. ఎక్కువ నీళ్లు తాగండి, పౌష్టికాహారం తీసుకోండి. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోండి.
చేయకూడనివి:
ఇతరులతో కరచాలనం చేయకండి. ఫ్లూ బారిన పడినవారు వాడిన టిష్యూ పేపర్, కర్చీఫ్‌లను ఉపయోగించవద్దు. కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకకండి. వైద్యుని సంప్రదించకుండా స్వతహాగా మందులు వాడకండి. ప్రజలంతా ఈ సూచనలు పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.

Post a Comment