సింగపూర్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, దావోస్‌కు సిద్ధం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగించింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటన ఆదివారంతో ముగిసింది. పర్యటనలో భాగంగా సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన రాష్ట్ర బృందం, పెట్టుబడులపై కీలక చర్చలు నిర్వహించింది.
సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్న ఈ సమావేశాల్లో, ఇండియన్ ఓషియన్ గ్రూప్ సీఈవో ప్రదీప్, డీబీఎస్, బ్లాక్ స్టోన్, మైన్ హార్డ్ కంపెనీల ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ చర్చలు సింగపూర్‌లో పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించాయి.
ఇదిలా ఉండగా, రాష్ట్ర బృందం జనవరి 20 నుంచి 22 వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననుంది. గత దావోస్ సదస్సులో 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకురావడంతో, ఈసారి మరింత పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రతినిధి బృందం, కొత్తగా తీసుకువచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఈ సదస్సులో ప్రదర్శించనుంది.

Post a Comment