ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు JIH సహకారం
కొత్తగూడెం: పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకారం అందించడంలో జమాతే ఇస్లామి హింద్ సంస్థ విశేష పాత్ర పోషిస్తోంది. రుద్రంపూర్, రామవరం శాఖ ఆధ్వర్యంలో రామవరం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి, వారికి సాయంత్రం పూట అల్పాహారం అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి దయాల్ మాట్లాడుతూ, "చదువు సంస్కారాన్ని నేర్పి, సమాజంలో గౌరవంతో జీవించేలా చేస్తుంది. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, "చదువే సకల సమస్యలకు పరిష్కారం. మంచి చెడులను గుర్తించే విజ్ఞానం విద్య ద్వారా లభిస్తుంది. అందుకే గత పది సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పేద విద్యార్థులకు దుస్తులు, నోటుపుస్తకాలు, అల్పాహారం అందిస్తున్నాం" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాత విజయవాడ కిశోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు చేయూత అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మాజీద్ రబ్బానీ, జాకీర్ నజీర్, అబ్దుల్ నజీర్, షమీం, ఇర్ఫాన్, పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Post a Comment