కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 16) రాత్రి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి, అక్కడి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఏటా కుటుంబంతో కలిసి కొంత సమయం విదేశాల్లో గడిపే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాదికూడా కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యటనలోనే తన 75వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోనున్నారు. ఈ నెల 20న ఆయన పుట్టినరోజు నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉండే అవకాశముంది.
విదేశీ పర్యటన ఏప్రిల్ 17న ప్రారంభమై, ఐదు రోజుల పాటు కొనసాగనుంది. సీఎం కుటుంబం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 1 గంటకు విదేశాలకు బయలుదేరనున్నారు. పర్యటన అనంతరం ఏప్రిల్ 21 అర్ధరాత్రి అమరావతికి తిరిగి చేరుకునే కార్యక్రమం ఉంది.
ఈ పర్యటనలో చంద్రబాబు విశ్రాంతి సమయంలో కుటుంబంతో గడిపే అవకాశాన్ని వినియోగించుకోనున్నారు. అధికారిక కార్యక్రమాలేవీ లేకుండా పూర్తిగా వ్యక్తిగత విహారంగా ఈ పర్యటనను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Post a Comment