-->

ఆరోగ్యంతో అందకర జీవితం – జీవనశైలిలో మార్పులు అవసరం

  

ఆరోగ్యంతో అందకర జీవితం – జీవనశైలిలో మార్పులు అవసరం

లీగల్ న్యూస్, కొత్తగూడెం: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ గవర్నమెంట్ హైస్కూల్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మారుతున్న కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాల్సిన అవసరం ఉంది" అన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని, "ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవనశైలిలో సరైన మార్పులు తీసుకురావాలి" అన్నారు. పౌష్టికాహారం, తగినంత నీటి సేవనం ద్వారా శారీరకంగా సక్రమంగా పని చేయగలమని, అలాగే మానసిక దృఢత కోసం ఒత్తిడి నుండి విముక్తి అవసరం, దానికోసం రోజువారీ యోగా అవసరమని సూచించారు.

డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జయలక్ష్మి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి, ఆరోగ్య సంబంధిత అనేక అంశాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమం అనంతరం, భానుమతి బాబు క్యాంపులో ఉన్న భవిత సెంటర్‌ను సందర్శించి అక్కడి పిల్లలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అక్కడి వసతి, ఆహార, విద్యా పరమైన సదుపాయాలపై అధికారుల నందు వివరణ కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు లక్కినేని సత్యనారాయణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, డిప్యూటీ డెమో ఫయాజుద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఉపాధ్యాయులు షేక్ దస్తగిరి, చందర్ రావు, సునందిని మరియు ఇతరులు పాల్గొన్నారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెరిగి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793