-->

బస్సు లోయలో పడిపోయి ఐదుగురు దుర్మరణం

బస్సు లోయలో పడిపోయి ఐదుగురు దుర్మరణం


హిమాచల్ ప్రదేశ్‌లోని మసేరన్ ప్రాంతంలో హృదయవిదారక ప్రమాదం చోటుచేసుకుంది. సర్కాఘాట్ నుండి దుర్గాపూర్‌కు వెళ్లుతున్న ప్రయాణికుల బస్సు మధ్యాహ్న సమయంలో లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో సంఘటన స్థలంలోనే ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సుమారు 25 మీటర్ల లోతుకు బస్సు దూసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిని సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ప్యాసింజర్లను బిలాస్‌పూర్‌ లోని ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం బాధితులకు వైద్య సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన మండి జిల్లా ఎస్పీ సాక్షీ వర్మ మాట్లాడుతూ, "ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తాం" అని తెలిపారు.

ప్రమాద స్థలానికి రక్షణ బృందాలు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనతో మసేరన్ ప్రాంత ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అధికార యంత్రాంగం బాధితులకు సహాయం అందించడంలో పూర్తి స్థాయిలో చొరవ తీసుకుంటోంది.

Blogger ఆధారితం.