కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేస్తాం... రాహుల్ నేతృత్వంలో ఉద్యమానికి సిద్ధం: మహేష్ గౌడ్
న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొన్నారు. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వే, అలాగే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై చర్చించామని మహేష్ గౌడ్ తెలిపారు.
"తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయంగా కుల గణన సర్వే చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించింది. ఇప్పుడు కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది" అని గౌడ్ పేర్కొన్నారు.
కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర బిల్లుల అంశాన్ని కూడా నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. "గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్లిన బిల్లులు ఇంకా ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరాం" అని అన్నారు.
బీజేపీపై విమర్శలు:
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. "శాసనసభలో ఓటు వేసిన బీజేపీ, అదే విషయంపై కేంద్రానికి వెళ్లిన తర్వాత యూటర్న్ తీసుకుంది. బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది" అని విమర్శించారు.
ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణ:
ఇండియా కూటమిలోని పార్టీల నేతలతో కలిసి ఈ అంశంపై సంపూర్ణ అవగాహన కల్పిస్తామని, అవసరమైతే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు.
ఈ రోజే సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ కుల గణన పై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు మహేష్ గౌడ్ ప్రకటించారు.
"తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రోల్ మోడల్‌గా మారింది. దేశవ్యాప్తంగా బీసీ హక్కుల కోసం పోరాటానికి ఇది శ్రీకారం అవుతుంది" అని అన్నారు.
Post a Comment