-->

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యక్షమైన భారీ నాగుపాము – భక్తుల్లో కలకలం

 

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యక్షమైన భారీ నాగుపాము – భక్తుల్లో కలకలం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలో రాహు-కేతు దోష నివారణ పూజల సమయంలో పెద్దనాటి నాగుపాము ప్రత్యక్షమై భక్తుల్లో కలకలం రేపింది.

ప్రతి రోజు వేలాది మంది భక్తులు రాహు, కేతు దోషాల నివారణ కోసం ఈ ఆలయానికి చేరుకుంటుంటారు. శనివారం ఉదయం ఆలయంలో రూ.750 టికెట్‌తో జరిగే ప్రత్యేక పూజ మండపం మెట్ల వద్ద ఓ భారీ నాగుపాము కనిపించింది. దాన్ని చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. పూజలకు వచ్చిన వందలాది మంది కొంతసేపు భయభ్రాంతులకు లోనయ్యారు.

అనంతరం ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి పాములను పట్టే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని పామును సురక్షితంగా పట్టుకొని ఒక సంచిలో వేసి సమీపంలోని అడవిలో వదిలేశారు. ఎటువంటి హానీ జరగకుండా పామును సమర్థవంతంగా పట్టుకోవడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై పూజారులు స్పందిస్తూ, ‘‘ఇది దేవుని క్షేత్రం. ఇక్కడ నాగుపాము ప్రత్యక్షమవడం అసాధారణం కాదు. పైగా ఇది రాహు-కేతు దోషాల నివారణ స్థలం. ఇలాంటి సందర్భంలో నాగుపాము దర్శనమిచ్చినదంటే అది శుభసూచకమే’’ అని వ్యాఖ్యానించారు.

భక్తుల ప్రకారం, శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనంతో రాహు, కేతు దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. అలాంటి పవిత్ర స్థలంలో నాగుపాము ప్రత్యక్షమవడం ఆధ్యాత్మిక విశ్వాసాలకు మరింత బలాన్నిస్తుంది.

Blogger ఆధారితం.