-->

హత్య కేసును చేదించిన పోలీసులు – ఇద్దరు నిందితులు అరెస్ట్

హత్య కేసును చేదించిన పోలీసులు – ఇద్దరు నిందితులు అరెస్ట్


ప్రేమ వ్యవహారం నేపథ్యంలో దారుణ హత్య మృతుడు మహమ్మద్ షాబీల్‌గా గుర్తింపు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వివరాలు

మెదక్ జిల్లా, శివంపేట:
మెదక్ జిల్లా శివంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మక్దూంపూర్ గ్రామ శివారులో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారం నేపథ్యంగా మహమ్మద్ షాబీల్ (వయసు 21) అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు.

హత్య ఘటన వివరాలు:
2025 జూలై 22న మక్దూంపూర్ శివారులో రోడ్డుకు సమీపంలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని పంచాయతీ సెక్రటరీ గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఆ అనంతరం చేపట్టిన విచారణలో మృతుడిని హైదరాబాద్ బోరబండకు చెందిన మహమ్మద్ షాబీల్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇతడు కార్ డెంటింగ్ & పెయింటింగ్ పనులు చేసేవాడిగా సమాచారం.

హత్యకు గల కారణం:
డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, షాబీల్ తన చిన్న నాన్న కూతురితో ప్రేమలో పడ్డాడు. అయితే వివాహానికి ఆమె కుటుంబం నిరాకరించడంతో షాబీల్, తన వద్ద ఉన్న ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె తండ్రి సయ్యద్ అప్సర్ (34) తన స్నేహితుడు సారోల్ల సంతోష్ (39) సహాయంతో షాబీల్‌ను హత్య చేశాడు.

హత్య విధానం:
జూలై 21న నిందితులు షాబీల్‌ను కారులో మక్దూంపూర్ శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ ఫోన్‌లో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమని ఒత్తిడి చేయగా, షాబీల్ నిరాకరించాడు. దాంతో గొంతు పిసికి, తలకు బండరాయితో బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

అరెస్టు, దర్యాప్తు వివరాలు:
జూలై 24న తూప్రాన్ గేట్ వద్ద పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన మారుతి స్విఫ్ట్ కారు (TS05EK5466), రెండు స్మార్ట్‌ఫోన్లు, మృతుడి దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్‌కు తరలించి, కేసులో మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.