బాబాయ్‌ను గాయపరిచిన కేసులో ఏడాది జైలు శిక్ష
కొత్తగూడెం లీగల్: పాల్వంచ మండలం పాండంగాపురంలో 2022 ఫిబ్రవరి 21న జరిగిన దాడి ఘటనపై నిందితుడికి శిక్ష ఖరారు అయ్యింది. తన బాబాయ్‌పై దాడి చేసిన మైనేని ఉదయభాస్కర్‌కు శుక్రవారం కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్ కుమార్ ఏడాది జైలు శిక్ష, ₹1000 జరిమానా విధించారు.
ఆదాయంగా ఉన్న సమాచారం ప్రకారం... ఘటన జరిగిన రోజున సాయంత్రం 5 గంటల సమయంలో మైనేని వెంకటేశ్వరరావు పొలంలో నీరు పెట్టుకుంటూ ఉండగా, వారసత్వ భూ వివాదాన్ని మనసులో పెట్టుకొని, పెద్దనాన్న కొడుకైన ఉదయభాస్కర్ కర్రతో ఆయనపై దాడి చేశాడు. తలపై, మూతిపై, కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ మేరకు మైనేని వెంకటేశ్వరరావు కూతురు దుగ్గిని ఉష పాల్వంచ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ కె. సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేసులో మొత్తం 12 మంది సాక్షులను విచారించిన అనంతరం, ఇరుపక్షాల వాదనలు వినిపించిన జడ్జి నిందితుడికి శిక్ష విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్.ఐ.జి. ప్రవీణ్ కుమార్, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పి.సి. సిగా వెంకటేశులు సహకరించారు.
Post a Comment