-->

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ ఆత్మవిశ్వాసం

బీజేపీ మెడలు వంచినా బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తాం – సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ హక్కుల పరిరక్షణపై మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. అవసరమైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేస్తూ మెడలు వంచినా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేయడం తమ ప్రభుత్వ సంకల్పమని, ఇది కేవలం మాటలకే పరిమితముకాదని హామీ ఇచ్చారు.

42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు

రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ఈ రిజర్వేషన్లతో త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రైతు ఉద్యమాన్ని కేంద్రం తొలుత వ్యతిరేకించినా చివరకు ఆందోళనలపై దిగొచ్చినట్లు, బీసీ రిజర్వేషన్ అంశంలోనూ కేంద్రాన్ని మోకరిల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

బీజేపీ ధోరణిపై విమర్శలు

బీజేపీ ధోరణిపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ‘‘వారికి ఒకే విధమైన పోకడ – మొదట ససేమిరా అంటారు, తర్వాత పారిపోతారు,’’ అంటూ చురకలు వేసారు. బీసీల విషయంలో తమ ప్రభుత్వం తలచిన నిర్ణయం అమలవుతుందన్నారు. ‘‘కేంద్రం అడ్డుపడినా వెనకడుగు లేదు.. బీసీలకు సముచిత న్యాయం కల్పించేవరకు పోరాటం ఆగదు,’’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.

సామాజిక న్యాయం కోసం సంకల్పం

తెలంగాణలో బీసీ సామాజిక న్యాయం కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందని, త్వరలోనే ఈ దిశగా మైలురాయి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని సీఎం రేవంత్ హింట్ ఇచ్చారు. సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ఆశలకు తగిన కార్యాచరణను చేపడతామని చెప్పారు.

Blogger ఆధారితం.