-->

కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ ఆరోగ్యశ్రీ సేవలు త్వరలోనే అందుబాటులోకి

కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ ఆరోగ్యశ్రీ సేవలు త్వరలోనే అందుబాటులోకి


హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 2025 జనవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 89.95 లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా 2.81 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో నమోదు చేశారు. వీరందరికీ నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 6 లక్షల కార్డులు జారీ కాగా, కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు వ్యవస్థలోకి చేరారు. వీరి వివరాలను కూడా ఆరోగ్యశ్రీ పోర్టల్‌లోకి ఎక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబరు 2023లో ప్రభుత్వం మారిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు మరింత విస్తరించాయి. ఇప్పటివరకు 10.72 లక్షల మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందగా, వాటికి సంబంధించి రూ.1,590 కోట్లకు పైగా బిల్లులు ప్రభుత్వం చెల్లించింది.

ప్రతి నెలా సగటున రూ.100 కోట్ల వరకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వ నిబద్ధతను చూసి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 461 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఈ సేవల్లో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.