-->

చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్

చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్


మందమర్రి, చిన్నారుల అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలైన Instagram, Facebookల్లో షేర్ చేసిన కేసులో మందమర్రి పట్టణానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జాతీయ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) అందించిన సమాచారం ఆధారంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఈ కేసును మందమర్రి పోలీసులకు అప్పగించింది. వెంటనే స్పందించిన ఎస్సై రాజశేఖర్ సైబర్ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శశిధర్ రెడ్డి దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, “నాలుగు గోడల మధ్య కూర్చొని చిన్నారుల అశ్లీల వీడియోలు చూడడం, షేర్ చేయడం లేదా ఫార్వర్డ్ చేయడం ఎవరికి తెలియదు అన్న భావన తప్పు. చట్టం దృష్టిలో ఇవి తీవ్రమైన నేరాలు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

పోలీసులు సమాజంలో చిన్నారుల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అశ్లీల కంటెంట్‌కి దూరంగా ఉండాలని సూచించారు.

Blogger ఆధారితం.