ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ కలకలం
హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఉదయం వరుసగా రెండు చోట్ల చోరీలకు పాల్పడిన నిందితులు నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
మొదట కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు దుండగులు రెండు ఇళ్లలో చోరీ చేశారు. అక్కడ వృద్ధులను బెదిరించి రూ. 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లోనూ చోరీ జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
అదే సమయంలో చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ కలకలం రేపింది. ఉదయం 10.30 గంటల సమయంలో షాప్ ఓపెన్ చేసి ప్లెడ్జ్ పనుల్లో నిమగ్నమైన సిబ్బందిపైకి ఆరుగురు దుండగులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ సతీష్‌పై కాల్పులు జరిపి ఆయన కాలి లోపల బులెట్ దూసుకెళ్లింది.
కాల్పుల భయంతో సిబ్బంది పరుగులు తీశారు. ఈ అవకాశం లో దుండగులు వెండి, బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. గాయపడిన సతీష్‌ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వార్త అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు సమాచారం అందడంతో జిల్లా సరిహద్దు పోలీసులకు అలర్ట్ జారీ చేశారు.

Post a Comment