నవ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో యోగ్యత పత్రాల ప్రధానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : నవ లిమిటెడ్ పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు యోగ్యత పత్రాల బహుకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కే.సంజీవరావు హాజరయ్యారు.
ఎలక్ట్రికల్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థి డి. వంశీకృష్ణ మాట్లాడుతూ, “ఈ శిక్షణ ద్వారా నాకు మంచి భవిష్యత్తు లభించింది. స్నైడర్ ఎలక్ట్రికల్ ఇండియా కంపెనీలో నెలకు రూ.12 వేల వేతనంతో ఉద్యోగం పొందాను” అని ఆనందం వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథి సంజీవరావు మాట్లాడుతూ, “నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు గొప్ప వరం. యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి” అని సూచించారు.
నవ లిమిటెడ్ సి.ఎస్.ఆర్. జనరల్ మేనేజర్ ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, “ఇన్స్టిట్యూట్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 1711 మందికి పైగా వివిధ కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో చాలామంది సింగరేణి, కేటీపీఎస్, బీహెచ్ఈఎల్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ, కిర్బీ బిల్డింగ్స్, ఎంటార్, హెరిటేజ్ వంటి ప్రైవేట్ సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలు పొందారు” అని వివరించారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (ప్రొడక్షన్) ఎన్. సురేష్ చంద్ర, లైజన్ ఆఫీసర్ ఖాదరేంద్ర బాబు, ఒకేషనల్ ఇన్స్టిట్యూట్ మేనేజర్ సిహెచ్. శ్రీనివాసరావు, అలాగే విద్యార్థులు యు.ఎస్.ఎన్. శర్మ, బిన్ను, సాయి, శ్రావణ్, శ్యాం, అలీ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment