ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుకు ఇక ఫేషియల్ రికగ్నిషన్ విధానం
➤ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు
➤ ప్రతి రోజూ కలెక్టర్ల, డీఈఓల పర్యవేక్షణ
➤ డుమ్మా టీచర్లకు చెక్‌పడే అవకాశం
అనంతజనశక్తి న్యూస్, AP&TG:
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇకపై ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానం తప్పనిసరి కానుంది. విద్యాశాఖ తాజా ఆదేశాల ప్రకారం, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం అన్ని జిల్లాల డీఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, నేటి నుంచే (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరిస్తున్నారు. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్‌ఎస్, టీజీఆర్‌ఈఐఎస్ వంటి అన్ని విద్యాసంస్థలపై ఇది వర్తించనుంది.
✅ డీఎస్‌ఈ యాప్ ఆధారంగా హాజరు
ఇప్పటికే విద్యార్థులకు వినియోగిస్తున్న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ - ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు నమోదవుతుంది. హెచ్‌ఎంలు తమ సెల్‌ఫోన్ లో టీచర్, నాన్ టీచింగ్ మాడ్యూల్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫొటో, వివరాలు, పాఠశాల సమయం వంటి సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
🕘 పాఠశాల టైమింగ్‌లు:
- ప్రైమరీ స్కూల్స్ (PS): ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు
- యూపీఎస్, హైస్కూల్స్: ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకూ
ప్రతి టీచర్ రోజుకు రెండు సార్లు — ఉదయం హాజరు ముందు, సాయంత్రం విధులు ముగిశాక — FRS హాజరు తీయాలి.
👀 అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఇప్పటికే విద్యార్థుల హాజరును ప్రతిరోజూ సమీక్షిస్తూ, తక్కువ హాజరు ఉన్న పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల హాజరుపైనా ఇదే విధంగా పర్యవేక్షణ ఉంటుందని భావిస్తున్నారు. డీఈఓ కార్యాలయాల్లో డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్ర విద్యాశాఖ కూడా రోజువారీగా ఈ సమాచారాన్ని పరిశీలించనుంది.
🛑 ‘డుమ్మా’కి చెక్ పడే రోజులు..
కొంతమంది ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉండటంతో, FRS విధానం ద్వారా వీరిపై నిఘా పెట్టే వీలుంటుంది. ఆలస్యంగా పాఠశాలకు చేరడం, సాయంత్రం ముందు వెళ్లిపోవడం వంటి పరిస్థితులకు ఇక అంతుకట్టు పడనుంది.
📅 రిజిస్ట్రేషన్‌కు నాలుగు రోజుల గడువు
నేటినుంచి నాలుగు రోజులపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అందులో ఉపాధ్యాయులు తమ వివరాలను నమోదు చేసి, మొబైల్ యాప్ ద్వారా హాజరు తీయాల్సి ఉంటుంది.
📌 ముఖ్యాంశాలు:
- నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల FRS హాజరు అమలు
- విద్యార్థులకు వినియోగిస్తున్న DSE యాప్ ద్వారానే ఉపాధ్యాయులకు కూడా
- జియోట్యాగింగ్ సహా స్కూల్ ప్రాంగణంలోనే హాజరు నమోదు తప్పనిసరి
- సెలవులైతే యాప్ ద్వారా ముందుగానే రిక్వెస్ట్
- కలెక్టర్లు, డీఈఓలు ప్రతిరోజూ పర్యవేక్షణ
🗣️ పాఠశాలల్లో హాజరు నియమాలు కఠినతరం అవుతున్నాయి...
సకాలంలో విధుల్లో ఉండే వారికి మాత్రం దీని వల్ల అసౌకర్యం ఉండదు!
Post a Comment