సింగూరు డ్యాం భద్రతపై ఎన్‌డీఎస్ఏ ఆందోళన
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయం ప్రమాదంలో ఉందని జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థ (NDSA) హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజినీర్ (ENC)కు లేఖ రాసి, ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించింది.
ఎన్‌డీఎస్ఏ నివేదిక ప్రకారం, రిజర్వాయర్ నీటి నిల్వ ప్రాంతంలో పలుచోట్ల మట్టికట్ట, రివిట్‌మెంట్ దెబ్బతిన్నాయి. అదేవిధంగా పారపెట్ గోడ మరియు మట్టికట్ట పైభాగంలో పగుళ్లు గుర్తించబడ్డాయి. ఈ లోపాలు కొనసాగితే జలాశయం భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు స్పష్టంచేశారు.
సింగూరు డ్యాం కింద నిజాంసాగర్ మరియు మంజీరా జలాశయాలు ఉన్నందున, సింగూరు రక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్‌డీఎస్ఏ సదరన్ రీజియన్ డైరెక్టర్ పేర్కొన్నారు. డ్యాం పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని ఈఎన్‌సీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇది ఇలా ఉంటే, సింగూరు జలాశయం నుండి హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా జరుగుతుంది. కాబట్టి ఈ మరమ్మతుల విషయంలో ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment