వికారాబాద్‌లో భూకంపం.. జనంలో భయం (వీడియో)
వికారాబాద్: వికారాబాద్ జిల్లా ప్రజలను గురువారం తెల్లవారుజామున భూప్రకంపనలు కలవరపరిచాయి. ఉదయం సుమారు 4 గంటల సమయంలో పరిగి మండలంలోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. బసిరెడ్డిపల్లి, రంగారెడ్డి, న్యామత్‌నగర్ గ్రామాల్లో సుమారు 3 సెకన్ల పాటు భూకంపం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
భూమి కంపించిన వెంటనే ఇళ్లలో నిద్రిస్తున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ ప్రకంపనలతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు అయోమయంలో పడ్డారు. కొందరు వంటగదిలో పాత్రలు కదిలినట్లు, గోడల వద్ద చిల్లు శబ్దం వినిపించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం లేదు.
ఈ సంఘటనపై అధికారులు అప్రమత్తమై వివరాలు సేకరిస్తున్నారు. భూకంప తీవ్రత, కేంద్రబిందువుకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) నుంచి పూర్తి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. ప్రాంతీయ ప్రజలు ఇంకా భయాందోళనలో ఉన్నప్పటికీ, అధికారులు ఆందోళన చెందవద్దని, ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడలేదని హామీ ఇస్తున్నారు.

Post a Comment