-->

భూ తగాదాల్లో పోలీసుల జోక్యం… బాధితుల విలేకరుల సమావేశం

 

భూ తగాదాల్లో పోలీసుల జోక్యం… బాధితుల విలేకరుల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం: ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భూ తగాదాల్లో తలదూర్చి తప్పుడు కేసులు బనాయించి, బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు బాధితులు కొత్తగూడెం బాబుక్యాంపు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

చుంచుపల్లికి చెందిన మద్దెల గోవర్ధన్ మాట్లాడుతూ—1964లో తమ తాత పేరుతో రిజిస్ట్రేషన్ అయిన భూమిని వారసత్వంగా సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే కొంత భాగం మాత్రమే అమ్మకం జరిగినా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బినామీల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి మిగిలిన భూమిని కూడా కొనుగోలు చేసినట్లుగా చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

2018కు ముందే తాము భూమిని అమ్మినట్లుగా తప్పుడు పత్రాలు తయారు చేసి తమను బెదిరించారని, దీనిపై కోర్టులో కేసు వేయగా ఆ కేసు ఇంకా నడుస్తోందని వివరించారు. ఇదిలా ఉండగానే, ఇటీవల మరోసారి నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులను, పోలీసులను తప్పుదారి పట్టించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని, పోలీసుల సహకారంతో తమను భూమిలోనికి రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

తమపై దౌర్జన్యాలు చేసి, మరోసారి తప్పుడు కేసులు బనాయించారని, రెవెన్యూ–పంచాయతీ అధికారులు కూడా పోలీసులతో కలిసి అన్యాయం చేస్తున్నట్లుగా అనిపిస్తోందని బాధితులు మండిపడ్డారు.

“మాకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు మమ్మల్నే కేసుల్లో ఇరికిస్తున్నారు. మేము ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. లేకపోతే మాకు చావే శరణ్యం” అంటూ బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793