నవంబర్ 1 నుంచి బ్యాంకుల్లో నూతన మార్పులు
హైదరాబాద్, అక్టోబర్ 26: బ్యాంకుల్లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు నవంబర్ 1 నుంచి చెక్ పడనుంది. ఇప్పటివరకు ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆయన వారసులు ఆ ఖాతా సెటిల్ చేసుకోవడం పెద్ద తలనొప్పిగా మారేది. బ్యాంకు లాకర్లలో ఉన్న వస్తువుల సెటిల్‌మెంట్ విషయంలోనూ ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఈ సమస్యలకు ఇక తెరపడనుంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం – 2025’ కింద కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్పులు డిపాజిట్ ఖాతాలు, లాకర్లు, సెఫ్ కస్టడీ ఆస్తులు వంటి అంశాలపై ఖాతాదారులకు మరింత నియంత్రణ, సౌలభ్యాన్ని కల్పించనున్నాయి.
ఈ నూతన నిబంధనలు నవంబర్ 1, 2025 నుంచే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖాతాదారులు ఇకపై డిపాజిట్లు, లాకర్లకు నామినేషన్ (Nomination) ఎంపికను సులభంగా మార్చుకోవచ్చని, వారసత్వ సంబంధిత క్లిష్టతలను తగ్గించేందుకు ఈ సవరణలు ఉపకరిస్తాయని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టంలోని సెక్షన్లు 10, 11, 12, 13 కింద ఉన్న నిబంధనలను నోటిఫై చేసింది. ఈ చట్టాన్ని ఇప్పటికే ఏప్రిల్ 15, 2025న ఆమోదించినట్లు పేర్కొంది.
అదే విధంగా, ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1935, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955, అలాగే బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970లో మొత్తం 19 కీలక సవరణలు చేసినట్లు వెల్లడించింది.

Post a Comment