మద్యం దరఖాస్తుల గడువు పొడిగింపు..! లాస్ట్ డేట్ అక్టోబర్ 23
హైదరాబాద్: కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. దరఖాస్తు సమర్పణ గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి దరఖాస్తుల తుది గడువు అక్టోబర్ 18 (శనివారం) కాగా, ఆ రోజు బీసీ రిజర్వేషన్ బంద్ కారణంగా బ్యాంకులు మూతపడటంతో అనేక మంది వ్యాపారులు డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై వ్యాపారులు ప్రభుత్వానికి వినతులు సమర్పించడంతో, వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం గడువు పొడిగించింది.
గడువు పొడిగింపు నేపథ్యంలో, ఈ నెల 23న జరగాల్సిన లక్కీ డ్రా కార్యక్రమాన్ని అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ప్రకటించారు.
కొత్త మద్యం పాలసీ (2025–27) కోసం దరఖాస్తుల స్వీకరణ గత నెల 26న ప్రారంభమైంది. శుక్రవారం వరకు సుమారు 50 వేల దరఖాస్తులు రాగా, తుది గడువు రోజు ఒక్క రోజే మరో 37 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 90 వేల మార్కు దాటింది.
కార్యాలయాలకు సాయంత్రం 5 గంటల వరకు చేరుకున్న వ్యాపారులకు టోకెన్లు ఇచ్చి రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఈ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోనున్నారు.
గతంలో ఒక్కో దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు ఉండగా, ఈసారి దానిని రూ. 3 లక్షలకు పెంచడం గమనార్హం. మొదట్లో దరఖాస్తులు తక్కువగా రావడంతో ఆందోళన వ్యక్తమైందిగానీ, చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి.
Post a Comment