-->

పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌కి ఘన నివాళి – అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌కి ఘన నివాళి – అధికార లాంఛనాలతో అంత్యక్రియలు


వినాయక్‌నగర్‌, అక్టోబర్‌ 18 : పాత నేరస్తుడి చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్‌ బి. ప్రమోద్‌ అంత్యక్రియలు శనివారం అధికార లాంఛనాలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలోని కంఠేశ్వర్‌ న్యూబ్యాంక్‌ కాలనీ వద్ద జరిగింది.

నిజామాబాద్‌ కమిషనరేట్‌ సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రమోద్‌ను శుక్రవారం రాత్రి వినాయక్‌నగర్‌లో పాత నేరస్థుడు షేక్‌ రియాజ్‌ కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.

శనివారం ఉదయం జిల్లా ప్రభుత్వ దవాఖానలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో నార్త్‌ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య, అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రామచంద్రారావు, వివిధ ఏసీపీలు, పోలీస్‌ సంఘ ప్రతినిధులు, తోటి సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, “డిపార్ట్‌మెంట్‌ తరఫున లభ్యమయ్యే అన్ని బెనిఫిట్స్‌ త్వరగా అందిస్తాం. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తాం” అని భరోసా ఇచ్చారు.

నిందితుడు షేక్‌ రియాజ్‌ను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామని సీపీ సాయిచైతన్య తెలిపారు.

నేరస్థుడి సమాచారం ఇచ్చిన వారికి రూ.50 వేల రివార్డు

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య చేసిన నేరస్థుడు షేక్‌ రియాజ్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతి ప్రకటించింది నిజామాబాద్‌ పోలీసు శాఖ.

ఖిల్లా రోడ్‌ ప్రాంతంలోని అహ్మద్‌పుర కాలనీకి చెందిన రియాజ్‌పై దోపిడీ, దొంగతనం, హత్య కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసినవారు డయల్‌ 100, లేదా 87126 59793, 87126 59777 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కమిషనర్‌ సాయిచైతన్య విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793