-->

వైన్స్ షాపుల టెండర్ల హడావిడి! 60 వేల దరఖాస్తులు ఒక్కో షాపుకు సగటున 23 దరఖాస్తులు

వైన్స్ షాపుల టెండర్ల హడావిడి! 60 వేల దరఖాస్తులు ఒక్కో షాపుకు సగటున 23 దరఖాస్తులు


హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లపై హీట్‌ పెరిగింది. శనివారం (అక్టోబర్‌ 18) సాయంత్రం 4 గంటల వరకూ మొత్తం 60 వేల దరఖాస్తులు ఆబ్కారీ శాఖకు చేరాయి. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్‌ షాపులు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. ఈ నెల 23న లక్కీ డిప్‌ ద్వారా లైసెన్సుల కేటాయింపు జరగనుంది.

 ప్రభుత్వానికి భారీ ఆదాయం

ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజు వసూలు చేయగా, దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.18 వందల కోట్ల ఆదాయం చేరింది.
గత ప్రభుత్వ కాలంలో నిర్వహించిన టెండర్లకు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చి, రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.

 చివరి రోజుల్లో దరఖాస్తుల వెల్లువ

సెప్టెంబర్‌ 25న నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుండి మొదట మందకొడిగా సాగిన దరఖాస్తుల సమర్పణ, శుక్రవారం ఒక్కరోజే 25 వేల దరఖాస్తులతో ఊపందుకుంది. శనివారం మరో పది వేల దరఖాస్తులు చేరడంతో మొత్తం సంఖ్య 60 వేలకు చేరింది.

 గతంతో పోలిస్తే తగ్గిన స్పందన

గత ఎన్నికల సంవత్సరాల్లో (2023-24) భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ, ఈ సారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అప్లికేషన్‌ ఫీజు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకు పెరగడం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. అదనంగా, వ్యాపారులు సిండికేట్లుగా మారి కొద్దిపాటి దరఖాస్తులు మాత్రమే వేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

 హైదరాబాద్‌లో ఒక్క షాపుకు ఒక్క దరఖాస్తు!

ఆశ్చర్యకరంగా, హైదరాబాద్‌లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చినట్టు సమాచారం. రిజర్వుడ్‌ షాపులకూ ఈ సారి దరఖాస్తులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793