-->

6 తులాల బంగారు ఆభరణాలు వింత దొంగతనం – తిరిగి వచ్చిన బంగారం!

6 తులాల బంగారు ఆభరణాలు వింత దొంగతనం – తిరిగి వచ్చిన బంగారం!


మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి గ్రామంలో అచ్చం సినిమా సన్నివేశంలా ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.

వారం క్రితం ఆనసూర్య అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి గుమ్మం వద్ద గూటిలో ఉంచిన తాళం చెవి తీసుకుని, గుర్తు తెలియని దొంగలు తాళం తెరిచి లోపలికి వెళ్లారు. వారు ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలు, అలాగే నగదును దోచుకెళ్లారు. బయట ఊరికి వెళ్లి తిరిగి వచ్చిన ఆనసూర్య ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. కన్నీరు మున్నీరు గా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఈ దొంగతనం వెనుక “ఇంటి తాళం ఎక్కడ ఉంచుతారో తెలిసినవాళ్లే ఉన్నారేమో” అనే కోణంలో విచారణ సాగింది.

అయితే, అనూహ్యంగా వారం రోజులకు తర్వాత ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. నిన్న తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తున్న సమయంలో, ఎవరో తెలియని వ్యక్తి ఇంటి ముందు బంగారం, వెండి ఆభరణాలు వేసి వెళ్లిపోయాడు. తెల్లారిన తరువాత ఇంటి ముందు చల్లుకుంటున్న ఆనసూర్యకు ఆ మెరుపు బంగారం కనిపించింది. దగ్గరగా వెళ్లి చూసే సరికి అవే తన ఆభరణాలేనని గుర్తించింది.

ఇరుగుపొరుగు వారిని పిలిచి ఆ విషయాన్ని తెలిపిన ఆమె, తాను కోల్పోయిన బంగారం తిరిగి లభించడంపై సంతోషం వ్యక్తం చేసింది. తన బాధను గమనించి కనికరించిన దొంగలకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.

👉 “ దొంగతనం చేసినా మనసు మార్చుకుని తిరిగి ఇచ్చారు అంటే మనిషితనం ఇంకా బతికే ఉందని చెప్పొచ్చు” అని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793