ఐక్యతతో జీవిస్తే సమాజం ఆనందమయం అవుతుంది: షేక్ అబ్దుల్ బాసిత్
జమాతే ఇస్లామి హింద్ సభ్యుల సందేశం
మదుర బస్తీ, అక్టోబర్ 31: “ఐక్యతతో జీవిస్తే సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి” అని జమాతే ఇస్లామి హింద్ సభ్యుడు షేక్ అబ్దుల్ బాసిత్ తెలిపారు.
పవిత్ర శుక్రవారం నమాజ్ సందర్భంగా స్థానిక గణేష్ టెంపుల్ మదుర బస్తీలోని మస్జిద్-ఎ-వహీద్లో ఆయన మాట్లాడుతూ—మానవులందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని, విశ్వమానవులంతా ఆయన వాసులేనని చెప్పారు.“సాటి మనుషులతో ప్రేమ, దయ, సౌజన్యంతో మెలగడమే నిజమైన ఆరాధన, భక్తి” అని ఆయన వివరించారు.
ప్రవక్త మహ్మద్ (స) ఉపదేశాలను ఉటంకిస్తూ —
“తన చేతలతో, మాటలతో లేదా సైగలతో సాటి మనిషిని బాధపెట్టడం మహాపాపం” అని తెలిపారు.
“నేలపై ఉన్నవారిని కరుణించు, నింగిలో ఉన్న వాడు నిన్ను కరుణిస్తాడు” అనే ప్రవక్త వచనాన్ని స్మరింపజేస్తూ, సమాజసేవే నిజమైన భక్తి అని పేర్కొన్నారు.
“ఈ జీవితం తాత్కాలికం; అసలైన జీవితం మరణానంతరం. ఆ జీవితం సుఖమయం కావాలంటే మన చుట్టూ ఉన్న మానవులతో మంచితనం, ప్రేమతో వ్యవహరించాలి” అని షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు.
ప్రతి ఒక్కరూ చెడుకు దూరంగా, మంచిని వ్యాప్తి చేయడం అల్లాహ్ ఆదేశమని, అలా చేస్తే సమాజం ఆనందాల హరివిల్లు అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి పట్టణ అధ్యక్షుడు షారుఖ్ యజ్దాని, గాజీ సలావుద్దీన్, యూసుఫ్ ఖాన్, జబ్బార్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment