విద్యా దానం మిన్న – జమాతే ఇస్లామి హింద్ సేవాభావం ప్రశంసనీయం
చుంచుపల్లి మండలం, రుద్రంపూర్: “అన్ని దానాలలో విద్యా దానం మిన్న, పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత” అనే నినాదంతో జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల రుద్రంపూర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
గత పదిహేను సంవత్సరాలుగా పేద విద్యార్థుల చదువుకు విభిన్న రూపాల్లో సహాయసహకారాలు అందిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి బాలాజీ జమాతే ఇస్లామి హింద్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
గత విద్యాసంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మోమెంటోలు, దుస్తులు మరియు నగదు బహుమతులు అందజేశారు. అదనంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు కూడా నాటారు.
దివంగత సాదియా స్మారకార్థం ఆమె మనవరాలు మన్హా షహరిష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించగా, సంస్థ సభ్యుడు షేక్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ — “విద్య విషయంలో ఎలాంటి సహాయం అవసరమైనా జమాత్ ఎల్లప్పుడూ ముందుంటుంది” అన్నారు.
మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయం. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుంది” అన్నారు.
జమాత్ అధ్యక్షుడు రబ్బానీ మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బహుమతి గ్రహీతలు సుహాన, లక్ష్యా, దీక్షితా, సిపిఐ చుంచుపల్లి కార్యదర్శి తోటి రాజు, గూడెల్లి యాకయ్య, జమాతే ఇస్లామి హింద్ సభ్యులు మదార్, షమీం, ఉపాధ్యాయులు బాలు, రవి, లక్ష్మీ, వెంకటేశ్వరరావు, రాధ, రజీయ, గణేష్, ఇందిరా, కృష్ణ వేణి, నిర్మల, చారీ, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment