-->

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

"ప్రతి అధికారి ఫీల్డ్‌లో ఉండాలి — నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు!"

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: మొంథా తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని తుఫాన్‌ ప్రభావిత 16 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి అధికారి ఫీల్డ్‌లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.

నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. “ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఎక్కడా అలసత్వం ఉండకూడదు” అని ఆయన అన్నారు.

విద్యుత్‌, రహదారి, వైద్య విభాగాలు సిద్ధంగా ఉండాలి:
తుఫాన్‌ కారణంగా విద్యుత్‌ అంతరాయాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లో–లెవల్‌ కాజ్‌వేలు, దెబ్బతిన్న రహదారుల వద్ద ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని అవగాహన కల్పించాలని ఆదేశించారు.

వరంగల్‌ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి:
వరంగల్‌లో తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున హైడ్రా సేవలు సిద్ధంగా ఉంచాలని, ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రాణ నష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సీఎం వరంగల్‌ పర్యటన వాయిదా:
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇవాళ్టి వరంగల్‌ పర్యటన వాయిదా వేసుకున్నానని సీఎం తెలిపారు. రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేస్తానని వెల్లడించారు.

“ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాం” అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేణు నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793